Friday, 29 April 2011

శ్రీ శిరిడీ సాయి లీలామృతం - 201




బాబా తరచుగా తన భక్తులకు ఒక దుకాణం నుండి హల్వా కొని ప్రసాదంగా పంచుతుండేవారు. 1916 వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి విజృంభించి ఎందరినో బలి తీసుకుంది. ఆ దుకాణందారుడు కూడా ప్లేగు వలన మరణించాడు. శవం ఇంకా ఇంట్లోనే వుంది. బాబా నార్కేను పిలిచి ఆ దుకాణం నుండి హల్వా తీసుకొని రమ్మని చెప్పారు. నార్కే ఆ దుకాణానికి వెళ్ళి జరిగిన సంగతి తెలుసుకొని మాంపడిపోయడు. ప్లేగు విజృంభిస్తున్న కారణంగా ఆ దుకాణం నుండి ఏమి తీసుకువెళ్ళినా అది తమ ప్రాణాలకు ప్రమాదం అని భావించాడు. అయిన బాబా మాటలకు లేని ధైర్యం కూడగట్టుకొని హల్వా ఇవ్వమని అతని భార్యను అడిగాడు. భర్త శవంపై పడి తీవ్రంగా రోదిస్తున్న ఆమె ధైర్యం వుంటే ఆ అలమార నుండి హల్వా తీసుకుపొమ్మని నార్కేకు చెప్పింది.నార్కే వణుకుతున్న చేతులతో హల్వా మిఠాయిని తీసుకొని భయం భయంగా మశీదుకు వచ్చాడు.బాబా దానిని అందుకొని తన చేతులతో పవిత్రమొనర్చి అందరికీ ప్రసాదంగా పంచమని ఆజ్ఞాపించారు.

నోట్లో పెట్టుకోవడానికి సంశయిస్తున్న నార్కేను పిలిచి "శిరిడీలో వున్నా, ఈ ప్రసాదం తిన్నా చచ్చిపోతావని భయపడుతున్నావు కదూ ! సమయం వచ్చినప్పుడు నువ్వు శిరిడీలో వున్నా, సప్త సముద్రాల అవతల వున్నా మృత్యుదేవత కబళించక మానదు. మన ఆయువు నిండినప్పుడు ఒక్క క్షణం కూడా ఎక్కువ బ్రతకడం సాధ్యం కాదు. మన స్వంతమని భావిస్తున్న ఈ సిరి సంపదలు, భోగ భాగ్యాలు, మన కుటుంబ సభ్యులు,స్నేహితులు అందరినీ విడిచి వెళ్ళక తప్పదు. ఈ సత్యాన్ని గ్రహించి వివేక వైరాగ్యాలతో, ప్రతీ క్షణం ధర్మ వర్తనుడై జీవించి అతి దుర్లభమైన,పవిత్రమైన ఈ మానవ జన్మకు సార్ధకత చేకూర్చుకో ! " అని పెద్దగా నవ్వేసి " నిర్భయంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించు, నీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు" అని అన్నారు.

ప్లేగు వ్యాధి విజృంభిస్తున్నా బాబా ఆశీర్వాదం వలన నార్కే అక్కడే వుండి ఎట్టి ప్రమాదం లేక హాయిగా జీవించాడు. ప్రకృతి శక్తుల కన్నా, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం, పరి శుద్ధ పరమేశ్వర అవతారం అయిన శ్రీ సాయినాధుని ఆశీర్వాద కవచమే ఎంతో శక్తివంతమైనది అని గ్రహించాడు. అంతే జనన మరణ చక్ర భ్రమణం గురించి బాబా పైలీల ద్వారా బోధించిన అద్భుతమైన సందేశామృతాన్ని కూడా అవగతం చేసుకున్నాడు.మానవుడు భగవంతుడు నిర్దేశించిన ధర్మ పధంలో ఎట్లు జీవించి తరించాలో అతనికి అర్ధమయ్యింది. బాబా వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. అవియే వేద మంత్రాలు, ధర్మాన్ని బోధించే ఆర్యోక్తులు.

సర్వం శ్రీ శిరిడీ సాయి చరణరవిందార్పణ మస్తు.

లోకా స్సమస్తా సుఖినోభవంతు

0 comments: