Tuesday 11 September 2012


భక్తుల పాలిట ఆశ్రిక కల్పవృక్షము, కామధేనువు,భక్త జన బాంధవుడు,కలియుగ దైవం అయిన శ్రీ సాయినాధునిది ఒక అద్భుతమైన , అసామాన్యమైన విశిష్ట అవతారం. అఖిలాండకోటి బ్రహ్మాండములకు నాయకునిగా, యోగులందరికీ సామ్రాట్టుగా కీర్తించబడుతున్న శ్రీ సాయినాధుడు భక్త సులభుడు. భక్తులకు ఎట్టి కఠోర నియమాలకు పెట్టక, కేవలం దర్శన, స్మరణలతోనే ప్రసన్నులౌతారు. తనకు సంపూర్ణ, సర్వస్య శరణాగతి ఒనరించిన భక్త జనావళికి వారి లలాట లిఖితంలో లేని వాటిని సైతం ప్రసాదీంచే బ్రహ్మ దేవుడు శ్రీ సాయి. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని తరచుగా బాబా చెప్పేవారు.ఐహికపరమైన , ప్రాపంచిక కోరికలతో దర్శించరాదని ఇతరులకు బోధిస్తున్న ఒక భక్తునితో "అలా చెప్పవద్దు. నా సన్నిధికి మొదట అందరూ అలానే వస్తారు, కష్టాలు,కోరికలు తీరి , జీవితంలో ఒక స్థాయి చిక్కాక నా మార్గంలో ప్రయాణం చేసి సన్మార్గులౌతారు "అని అన్నారు శ్రీ సాయినాధులు.
శ్రీ సాయి శిరిడీకి వచ్చిన తొలొ రోజులలో ఆకుపచ్చని కఫ్నీ , తలకట్టు ధరించి, సటకా చేత బట్టుకొని, నిత్యం ఆ గ్రామంలో కేవలం అయిదు ఇళ్ళలో మాత్రమే భిక్షాటనం చేసేవారు. అంతే కాక, ఆయన రోగులకు ఉచితంగా వైద్యం చేసేవారు. ఇతర వైద్యులవలే కాక శ్రీ సాయి వైద్యవిధానం చాలా విభిన్నంగా వుండేది. ఒకసారి శిరిడీ గ్రామంలో గణపతి హరికణాడే అనే ఒక భూకామందుకు కుష్టువ్యాధి వచ్చింది. బాబా యొక్క అనుగ్రహఫలితంగా ఆ వ్యాధి వెంటనే తగ్గిపోయింది. కానీ బాబా అతనికి విధించిన కొన్ని కట్టుబాట్లను హరికనాడే ఉల్లంఘించడంతో ఆ వ్యాధి మళ్ళీ ప్రాణాంతకంగా తిరగబెట్టి కొద్ది రోజులలోనే అతను మరణించాడు.హరికణాడే మరణ వార్త విన్న శ్రీ సాయిలో ఒక విధమైన పరవర్తన వచ్చింది. " ఈ మనుషులు ఎంత పిచ్చివారు? వారి మంచి కోరి చెప్పినా , తమకు నచ్చిందే చేస్తారు కాని మొరొకటి చెయ్యరు గాక చెయ్యరు"అనుకొని ఆనాటి నుండి రోగులకు మందులు ఇవ్వడం మానేసి తాను శిరిడీలోని మశీదులో తన యోగశక్తితో వెలిగించిన పవిత్రమైన ధుని నుండి వచ్చే బూడిదను ప్రసాదంగా ఇవ్వసాగారు.శ్రీ సాయి తన భక్తులకు ఆశీర్వదించి ఇచ్చే బూడిదనే ఊదీ(విభూతి) అని అంటారు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును ప్రసాదించడమే గాక సమస్త దుఖములను, భయాందొళనలను దూరం చేసేది.అన్ని రుగ్మతలకు దివ్యౌషధం, సకలైశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ సాయినాధుని ఊదీ చేసే మహిమలలో ఒక దానిని ఇప్పుడు స్మరించుకుందాం.

మహారాష్ట్రాలోని హర్ధా గ్రామంలో నివసించే ఒక వృద్ధుడు మూత్రకోసంలో రాయితో బాధపడేవాడు. ఆ రాయిని ఆపరేషను చేసి తీయాలని దాక్టర్లు సలహా ఇచ్చారు కాని అప్పటికే 70 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ వృద్ధుడు స్వతాహాగా మనోబలం లేనివాడు కావడం చేత ఆపరేషనుకు ఒప్పుకొనలేదు. ప్రసిద్ధులైన దాక్టర్లు మందుల ద్వారా ఆ రాయిని కరిగించాలని చూసారు గాని అది సాధ్యపడలేదు. కనుక ఆ బాధ వలన ఇక మరణమే శరణ్యమని ఆ వృద్ధుడు తీవ్రమైన మనోవేదనను అనుభవించసాగాడు.ఒకరోజు ఆ గ్రామపు ఇనాముదారు ఆ వృద్ధుడు ఇంటికి ఏదో పని మీద రావడం జరిగింది.ఆ వృద్ధుడు పడే బాధను గమనించి తన వద్దనున్న శ్రీ సాయి వీభూతిని నీటిలో కలిపి ఆ వృద్ధుడు చేత త్రాగించాడు. అపరయోగీస్వరుడూ, పరబ్రహ్మస్వరూపీ అయిన శ్రీసాయినాధుని విభూతి మహిమ చూడండి. అయిదు సంవత్సరాలలో కరగని ఆ రాయి విభూతిని సేవించిన అయిదు నిమిషాలలోనే కరిగి మూత్రంతో పాటు బయటకు వచ్చింది.ఆ వృద్ధుని బాధ శ్రీఘ్రమే మటుమాయం అయ్యింది. తాను కోరకుండానె తన బాధను తగ్గించి తన జీవితంలో వెలుగురేఖలను నింపిన కలియుగదైవం శ్రీసాయికి ఆ వృద్ధుడు అనేక వేల కృతజ్ఞతలను తెలియజేసుకున్నాడు.

మరొక సంధర్భంలో బొంబాయిలోని కాయస్త ప్రభు కులానికి చేందిన ఒక మహిళ ప్రసవ సమయంలో చాలా బాధ పడేది. ప్రతీ ప్రసవమూ ఆమెకు ఒక కొత్త జన్మలా వుండేది. ఒక సందర్భంలో ఆమె గర్భవతి అయ్యింది.ఎప్పటి వలే ఈ సారి కూడా ప్రసవ సమయంలో తాను పడే బాధలను తలుచుకొని ఆందొళన పడసాగింది. ఆమె దూరపు బంధువైన కళ్యాణ్ నివాసి అయిన రామ మారుతి అనువాడు ప్రసవమునకు ముందు శిరిడీకు పొవల్సిందని ఆ కుటుంబానికి సలహా ఇచ్చాడు. ఆ భార్యా భర్తలిద్దరూ శిరిడీకి పోయి కొన్ని నెలల పాటు వున్నారు. ప్రతి దినము మశీదుకు పోయి బాబాను పూజించసాగారు. ప్రసవ సమయంలో ఎప్పటివలే ఆమె సమస్యలను ఎదుర్కోసాగింది. చుట్టుపక్కల వారు బాబా భజన చేయుచూ ఆమె చేత విభూతిని త్రాగించారు. ఆశ్చర్యం, కొద్దిసేపటిలోనే ఆమె నొప్పులన్నీ తగ్గిపోయాయి, సుఖ ప్రసవం జరిగింది, పందంటి కొడుకు పుట్టాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీ సాయిని దర్శించి ఉదీ ప్రసాదములను తీసుకొని ఆనందంగా తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు.శ్రీ సాయి ఊదీ చేసే మహిమలింతింత కాదయా !

No comments: